
రాష్ట్రంలో టిఆర్ఎస్ తరువాత అంత చురుకుగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) అభ్యర్ధుల జాబితాను విడుదల చేస్తోంది. కొన్ని రోజుల క్రితం 27 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన బిఎల్ఎఫ్, మళ్ళీ ఈ నెల 11న సుమారు 30 మంది అభ్యర్ధులతో రెండవ జాబితాను విడుదల చేయబోతున్నట్లు బిఎల్ఎఫ్ ఛైర్మన్ నల్లా సూర్యప్రకాష్ తెలిపారు. రెండవ జాబితా విడుదల చేసిన తరువాత, రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని చెప్పారు. గద్దర్, కంచె ఐలయ్య, పలువురు మేధావులు తమ కూటమి తరపున ప్రచారసభలలో పాల్గొనడానికి అంగీకరించారని సూర్యప్రకాష్ తెలిపారు.
ఈ సందర్భంగా బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ, తెలంగాణా ముఖ్యమంత్రులిద్దరూ తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ఇరు రాష్ట్రాల ప్రజల మద్య చిచ్చుపెట్టడానికి వెనకాడటం లేదు. సిఎం కెసిఆర్ ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతుంటే, చంద్రబాబు నాయుడు కెసిఆర్‌పై పైచేయి సాధించేందుకు తెర వెనుక నుంచి మహాకూటమిని ప్రోత్సహిస్తున్నారు. ఈ రెండు పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ మాత్రమే. చిరకాలంగా వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్న బీసీలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు రాజ్యాధికారం కల్పించడమే బిఎల్ఎఫ్ లక్ష్యం. కనుక రాష్ట్రంలో బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలు బిఎల్ఎఫ్ కు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను,” అని అన్నారు.