ఓటర్ల జాబితాపై హైకోర్టు స్టే

రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషనుపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత దీనిపై తదుపరి ఆదేశాలు వెలువరిచే వరకు ఓటర్ల తుది జాబితాను విడుదల చేయరాదని, ఈసి అధికారిక వెబ్ సైటులో కూడా ఆ వివరాలు ఉంచకూడదని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ స్టే విధించింది. ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ కాపీని పిటిషనర్లకు, హైకోర్టుకు అందించాలని ఆదేశించింది. దానిపై హైకోర్టులో విచారణ జరిపి తీర్పు వెలువరించే వరకు తుది జాబితాను ఖరారు చేయరాదని ఆదేశించింది.

ఈ నెల 8న ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయాలనుకొంది. కానీ అదే రోజుకు ఈ కేసు వాయిదా పడింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగినట్లు పిటిషనర్ నిరూపించగలిగితే ఎన్నికల సంఘానికి మొట్టికాయలు తప్పవు. వాటిని సరిచేసే వరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. కనుక ఈ కేసుపై సోమవారం జరుగబోయే విచారణ చాలా కీలకం కానుంది.