కేటీఆర్‌, హరీష్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు

ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్‌ విజయం సాధించి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత కెసిఆర్‌ జాతీయ రాజకీయాలకు వెళ్లిపోతే తెలంగాణాకు ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. 

మంత్రి హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారని కానీ కెసిఆర్‌ ఆ పదవిని తన కుమారుడు కేటీఆర్‌కే కట్టబెట్టాలని భావిస్తునందున హరీష్ రావు అసంతృప్తితో ఉన్నారని, ఆ కారణంగా వారిరువురిమద్య ఆధిపత్యపోరు సాగుతోందని, వారిరువురి మద్య తీవ్ర అభిప్రాయభేదాలున్నాయని మీడియాలో తరచూ వార్తలు వస్తుంటాయి. వాటన్నిటికీ వారిరువురూ కలిసి తెరదించారు. 

మంత్రి కేటీఆర్‌ గురువారం హైదరాబాద్‌లో తన క్యాంప్ కార్యాలయంలో సిరిసిల్ల టిఆర్ఎస్‌ కార్యకర్తలతో సమావేశం అవుతుండగా మంత్రి హరీష్ రావు అక్కడికి వచ్చి ఆయన కూడా కార్యకర్తలకు ఎన్నికల ప్రచారం గురించి కొన్ని విలువైన సూచనలు చేశారు. గత నాలుగేళ్ళలో మంత్రి కేటీఆర్‌ తన సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి, అక్కడి చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేసిన కృషి కారణంగా చాలా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. సిరిసిల్లా నియోజకవర్గమే తన సిద్ధిపేట నియోజకవర్గానికి అభివృద్ధిలో ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 

మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ “మేమిద్దరం చిన్నప్పటి నుంచి బావాబావమరుదుల వలె కాక సొంత అన్నదమ్ములలాగే పెరిగాము. మా ఇద్దరి మద్య అభిప్రాయబేధాలున్నాయని మీడియాలో వస్తున్న వార్తలను చూసి మేమిద్దరం నవ్వుకొంటుంటాము. మా నియోజకవర్గాలను అభివృద్ధి చేయడంలోనే మేము పోటీ పడుతుంటాము తప్ప వేరే విషయాలలో కాదు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి సిరిసిల్లా జిల్లాకు నీళ్ళు అందించడానికి హరీష్ అన్న రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఆయన వల్లే మన జిల్లా బంగారం కాబోతోంది. సిఎం కెసిఆర్‌ మరో 10-15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగాలి. అప్పుడే తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ జిల్లా, ప్రతీ నియోజకవర్గం ఇలాగే బంగారు తునకలుగా మార్చుకోగలుగుతాము,” అని అన్నారు. 

టిఆర్ఎస్‌లో నెంబర్: 2 స్థానానికి పోటీదారులుగా భావిసస్తున్న వారిరువురూ ఈవిధంగా చాలా స్నేహపూర్వకంగా మాట్లాడటం టిఆర్ఎస్‌ నేతలకు, కార్యకర్తలకు చాలా సంతోషం కలిగిస్తుంది. పార్టీకి కూడా మేలు కలిగిస్తుందని చెప్పవచ్చు.