2.jpg)
ఈరోజు నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ మళ్ళీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “చంద్రబాబు నాయుడు ఒక నయవంచకుడు, తెలంగాణా ద్రోహి. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వెన్నుపోటు పొడుస్తాడు. తెలంగాణా ఏర్పడినప్పటి నుంచి మా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. మూడేళ్ల క్రితం చంద్రబాబు మా ప్రభుత్వాన్ని కూల్చి వేయడానికి కుట్ర పన్నుతునట్లు డిల్లీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ సాబ్ నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ మర్నాడే ఆయన హైదరాబాద్ వచ్చి టిఆర్ఎస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత ఏమి జరిగిందో అందరూ చూశారు. మనం ఒక్క తన్ను తంతే చంద్రబాబు నాయుడు వెళ్ళి విజయవాడలో పడ్డాడు. ఈసారి నేను మూడో కన్ను తెరిస్తే భస్మం అయిపోవడం ఖాయం.
తెలంగాణాతో పెట్టుకొంటే ఏమవుతుందో రుచి చూపించాము. అయినా బాబు మళ్ళీ మన జోలికి వస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపి మన రాష్ట్రాన్ని తన అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సిగ్గులేని కాంగ్రెసోళ్ళు తెలంగాణాను అస్థిరపరచాలని చూస్తున్న ఆ బాబుకు సై అంటూ సహకరిస్తున్నారు. రేపు 15 మంది టిడిపి ఎమ్మెల్యేలు గెలిచినట్లయితే మనం కట్టుకొంటున్న ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు పూర్తికానిస్తాడా? మన నీళ్ళు మనకి దక్కనిస్తాడా? కాంగ్రెస్ టిడిపిలకు అధికారం కట్టబెడితే ఈనగాచి నక్కల పాలు చేసినట్లఅవుతుంది. కనుక అటువంటి తెలంగాణా ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ప్రజలందరూ విజ్నతతో ఆలోచించి మరీ ఓటు వేయాలి. ఈ అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే మళ్ళీ టిఆర్ఎస్‌నే గెలిపించుకోవాలి. అప్పుడే మనం కన్న కలలన్నీ సాకారం చేసుకోగలుగుతాము,” అని సిఎం కెసిఆర్ అన్నారు.