వరంగల్ టిఆర్ఎస్‌ కార్యకర్తలకు కాంగ్రెస్‌ కండువాలు?

ఇటీవల టిఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా సురేఖ దంపతులు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టిఆర్ఎస్‌ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం మండలాలకు చెందిన 100 మంది టిఆర్ఎస్‌ కార్యకర్తలకు కొండా దంపతులు కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి తెచ్చుకొన్నారు. ఆత్మకూరు మండల కటాక్షపూర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు గఫార్, లక్ష్మణ్, రాజిరెడ్డిలు వారిని బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. 

ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి కొండా సురేఖ మాట్లాడుతూ, తనను నమ్మి టిఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు ఇకపై వారందరి బాగోగులు తానే చూసుకొంటానని హామీ ఇచ్చారు. ఈసారి పరకాల నుంచి పోటీ చేయబోతున్న తనను భారీ మెజార్టీతో గెలిపించడానికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. తాను ఎల్లప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. 

కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి టిఆర్ఎస్‌లో ఉన్న తమ అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించి తమ బలం నిలుపుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క టిఆర్ఎస్‌ నేతలు కూడా గ్రామాలలో పర్యటిస్తూ పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు చేజారిపోకుండా కాపాడుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక జిల్లాలో కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ పార్టీలలో చివరికి ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.