
తెలంగాణా కాంగ్రెస్ నేతలు నేడు జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా, సీనియర్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, విజయశాంతి, దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, వి.హనుమంత రావు, డికె అరుణ తదితరులు ఈరోజు ఉదయం ఆలంపూర్ చేరుకొంటారు.
వారందరూ ఉదయం 10 గంట్లకు జోగుళాంబ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత ఆలంపూర్ పట్టణంలో బహిరంగసభ నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆ తరువాత వారు శాంతినగర్ చౌరస్తా, ఐజ మున్సిపాలిటీలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు గద్వాల పట్టణంలో మరో బహిరంగసభ నిర్వహిస్తారు.
మళ్ళీ ఎన్నికల మొదలయ్యే వరకు వరుసగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడానికి వీలుగా తదుపరి సభల షెడ్యూల్ ఖరారు చేసుకొని మళ్ళీ ప్రజలలోకి వస్తారు. ముఖ్యనేతలు అందరూ ఒకే సభలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారం చేసినట్లయితే ఎన్నికలు మొదలయ్యేలోగా అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేయడం సాధ్యపడదు కనుక సీనియర్ నేతల అధ్వర్యంలో మూడు లేదా నాలుగు బృందాలను ఏర్పాటుచేసి ఒకే సమయంలో రాష్ట్రం నలుమూలల ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఎన్నికల ప్రచార కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.