కాంగ్రెస్‌ కంచుకోట నల్గొండలో నేడు గులాబీ సభ

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటిదని చెప్పబడుతున్న నల్గొండ జిల్లాలో సిఎం కెసిఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ పేరిట తన మూడవ ఎన్నికల ప్రచారసభను గురువారం నిర్వహించబోతున్నారు. స్థానిక టిఆర్ఎస్‌ నేతలు మర్రిగూడెం వద్ద గల 40 ఎకరాల స్థలాన్ని చదును చేసి అక్కడ బహిరంగసభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 3 లక్షల మందిని జనసమీకరణ చేసేందుకు టిఆర్ఎస్‌ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ సభ జరుగుతుంది కనుక అంతకంటే చాలా ముందుగా అక్కడకు చేరుకొనే ప్రజల కోసం భోజనాలు, మంచి నీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు వగైరాలన్నీ టిఆర్ఎస్‌ నేతలు ఏర్పాటు చేస్తున్నారు. 

ఈ సభను విజయవంతం చేసి టిఆర్ఎస్‌కు గట్టి సవాలు విసురుతున్న కోమటిరెడ్డి సోదరులకు తమ సత్తా చూపాలని టిఆర్ఎస్‌ నేతలు పట్టుదలగా ఉన్నారు. నిజామాబాద్‌లో బుధవారం జరిగిన బహిరంగసభలో సిఎం కెసిఆర్‌ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌, బిజెపి, టీజేఎస్ పార్టీలను దుమ్ము దులిపేశారు. ఈ రోజు సభలో ఆయన తన ప్రసంగంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి తదితర నేతలపై విమర్శలు గుప్పించవచ్చు. 

తాజా సమాచారం: రేపు (శుక్రవారం) ఖమ్మంలో నిర్వహించదలచిన ప్రజా ఆశీర్వాద సభ వాయిదా పడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాతే జిల్లాలో బహిరంగసభలు నిర్వహించాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం.