
కాంగ్రెస్ పార్టీ స్టార్ కేంపెయినర్ గా మీడియా, ప్రజల ముందుకు వస్తున్న సీనియర్ నేత విజయశాంతి మళ్ళీ రాజకీయాల గురించి చాలా మాట్లాడుతున్నారు. ఆమె ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “తెలంగాణా ఉద్యమ సమయంలో నేను కెసిఆర్‌తో కలిసి పనిచేశాను కనుక ఆయన గురించి నాకు బాగా తెలుసు. ప్రజలు ఆయనను నమ్మి అధికారం కట్టబెట్టారు కనుక ఆయన ఏవిధంగా పాలిస్తారో చూద్దామనే ఉద్దేశ్యంతోనే నేను ఇంతకాలం ఏమీ మాట్లాడలేదు. కానీ ఈ నాలుగేళ్ళ పాలనలో నిరంకుశత్వం, దళితులపై దాడులు, మాటలకే పరిమితమైన అభివృద్ధి వంటివన్నీ చూసిన తరువాత ఇందుకేనా మనం పొరాడి తెలంగాణా సాధించుకొన్నాము? అసలు రాష్ట్రంలో ఏమీ జరుగుతోంది? అని ప్రశ్నించుకోవలసివస్తోంది’ అని అన్నారు.
“ముఖ్యమంత్రి అన్నాక తరచూ ప్రజలలోకి వెళ్ళి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొంటూ తదనుగుణంగా పరిపాలన చేయాలి. కానీ సిఎం కెసిఆర్‌కు ప్రజలలోకి వెళ్ళరు. సామాన్య ప్రజలకు ప్రగతి భవన్ లోకి అనుమతించరు. కనుక సిఎం కెసిఆర్‌కు ప్రజలతో సంబందం ఉండదు. చివరికి టిఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా కెసిఆర్ అపాయింట్ మెంట్ లభించదు. కెసిఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రగతి భవన్ లో ప్రవేశించగలరు. ఆయన ఆ నలుగురికే ప్రతిపక్షాలను ఏవిదంగా ఎదుర్కోవాలో చెప్పి పంపుతుంటారు. మిగిలిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వారు చెప్పినవే వల్లె వేస్తుంటారు. ప్రగతి భవన్ లో నుంచి కాలు బయటకు పెట్టకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్న సిఎం కెసిఆర్‌ను చూస్తే ఇదేమి పాలన అనిపించకమానదు. ప్రజలు కెసిఆర్ పాలనతో విసుగెత్తిపోయున్నారు. కనుక ఆయనను గద్దె దించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నేను నా వంతు కృషి చేస్తాను,” అని చెప్పారు.
ఈ శాసనసభ ఎన్నికలలో తాను పోటీ చేయబోవడం లేదని విజయశాంతి మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తాను ఎటువంటి పదవులు ఆశించబోనని స్పష్టం చేశారు. తాను పదవులు అధికారం కోసం ఆరాటే పడేదాన్ని కాదని విజయశాంతి చెప్పారు.