
ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలో ఓటర్ల తుదిజాబితా ఖరారు కానుంది. కనుక డిల్లీ నుంచి వస్తున్న కేంద్ర ఎన్నికల కమీషన్ సభ్యులు ముందుగా దానిపై చర్చిస్తారు. ఆ తరువాత వారు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర పర్యటనకు బయలుదేరుతారు. ఆ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత అక్టోబర్ 12న హైదరాబాద్‌లో ఎన్నికల సంఘం కార్యాలయంలో వారు సమావేశం అయ్యి ముందస్తు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై చర్చిస్తారు. అన్నీ సవ్యంగా ఉన్నట్లు వారు భావిస్తే ముందస్తు ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
ఒకవేళ అక్టోబర్ 15లోగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే, నవంబరు మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి నవంబరు నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అక్టోబర్ రెండవ వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని సిఎం కెసిఆర్ శాసనసభను రద్దు చేసిన రోజునే చెప్పారు. బహుశః ఆ ప్రకారమే ఎన్నికల ప్రక్రియ జరుగవచ్చు. అంటే సిఎం కెసిఆర్ చెప్పినట్లుగా డిసెంబర్ నాటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్న మాట.