
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో మంగళవారం ఉదయం బాంబు ప్రేలింది. ఈ ఘటనలో 8 ఏళ్ళు వయసున్న ఒక పిల్లవాడు చనిపోగా, ఒక మహిళతో సహా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. కోల్ కతాలో ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ఖాజీపార అనే ప్రాంతంలో ఒక పళ్ళ దుకాణం ఎదుట ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ ప్రేలుడు జరిగింది. గాయపడినవారిని స్థానిక ఆర్.జి. మెడికల్ కాలేజీకి చెందిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రేలుడు జరిగినప్పుడు గ్యాస్ సిలిండర్ ప్రేలి ఉంటుందని అందరూ భావించారు కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కూరగాయల దుకాణం ముందు ఈ బాంబును అమర్చి పేల్చినట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.
గత కొన్ని వారాలుగా కోల్ కతాలో సిపిఏం, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మద్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఈ ప్రేలుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దక్షిణ డమ్ డమ్ మున్సిపాలిటీ ఛైర్మన్ పంచు రాయ్ కార్యాలయం ముందు జరుగడంతో, అది తన రాజకీయ ప్రత్యర్ధులు తనను టార్గెట్ గా చేసుకొని చేసిన దాడేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్ర సిఐడి పోలీస్, ఫోరెన్సిక్ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.