
తెలంగాణా శాసనసభ ఎన్నికలలో ఒంటరిగానే పోరాటం చేస్తామని రాష్ట్ర బిజెపి నేతలు ఇంతవరకు చెప్పుకొన్నారు. ఎందుకంటే, ఒంటరిగా పోటీ చేసి గెలువగలమనే ధీమాతో కాదు మతతత్వ పార్టీగా ముద్రపడిన దానితో ఏ పార్టీలు పొత్తులకు ముందుకురాకపోవడమే కారణం. బిజెపితో జత కడితే తమ ‘సెక్యులర్ ముద్ర’ ఎక్కడ దెబ్బ తింటుందోనే భయం కొంత, ఆ కారణంగా మైనార్టీ ఓట్లు కోల్పోతామనే భయం మరికొంత వెరసి ఏ పార్టీ రాష్ట్రంలో బిజెపితో పొత్తులకు ఆసక్తి చూపలేదు. గత ఎన్నికలలో బిజెపితో టిడిపి పొత్తులు పెట్టుకొంది కానీ ఆ తరువాత జరిగిన కధ అందరికీ తెలిసిందే.
డాక్టర్ చెరుకు సుధాకర్ అధ్యక్షతన ఏర్పాటైన తెలంగాణా ఇంటి పార్టీ బిజెపితో పొత్తులకు ఆసక్తి చూపుతునట్లు సమాచారం. బహుశః అందుకే బండారు దత్తాత్రేయ భావ స్వారూప్యత కలిగిన శక్తులతో పొత్తులకు సిద్దమని ప్రకటించారేమో? కానీ హిందుత్వ అజెండా కలిగిన బిజెపికి ‘భావస్వారూప్యత కలిగిన పార్టీ’ ఎక్కడ లభిస్తుంది? ఈ ఎన్నికలలో ఒకటో రెండో సీట్లు గెలుచుకొని తెలంగాణా ఇంటి పార్టీ తన ఉనికిని చాటుకోవాలని తహతహలాడుతోంది కనుక ఒంటరిగా ఉన్న బిజెపితో అది దోస్తీకి సిద్దపడి ఉండవచ్చు. దాని వలన బిజెపికి ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు కానీ జాతీయ పార్టీ అయిన బిజెపి వలన తెలంగాణా ఇంటి పార్టీకి కాస్తో కూస్తూ లాభించవచ్చు.