త్వరలో మరోసారి సర్జికల్ స్ట్రైక్స్?

పాక్ భూభాగంలో భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి సిద్దం అవుతోందా? అంటే అవుననే అనుకోవలసి వస్తుంది కేంద్రమంత్రి హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ మాటలు వింటే. 

యూపిలో ముజఫర్ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పాకిస్తాన్ మన పొరుగుదేశం. కనుక పాక్ సైనికులపై ఎన్నడూ మొదట కాల్పులు జరుపవద్దని సరిహద్దు వద్ద కాపలా కాస్తున్న మన జవాన్లను ఆదేశించాను. కానీ పాక్ సైనికులు కాల్పులు జరుపుతుంటే బుల్లెట్లు లెక్కపెడుతూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దని ధీటుగా బదులిమ్మని ఆదేశించాను. మన జవాన్లు ఎప్పుడూ నియంత్రణ పాటిస్తూనే ఉన్నారు కానీ పాక్ జవాన్లు చెలరేగిపోతున్నారు. ఇటీవల మన జవాను నరేంద్ర కుమార్ ను వారు ఎంత దారుణంగా హత్య చేశారో అందరూ చూశారు. తమ సహచరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని మన జవాన్లు రగిలిపోతున్నారు. అందుకు సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. రెండు మూడు రోజుల క్రితం ఎవరూ ఊహించలేని ఒక పరిణామం జరిగింది. దాని గురించి ఇప్పుడే చెప్పలేను కానీ త్వరలో మీకే తెలుస్తుంది,” అని చెప్పారు. 

అంటే త్వరలో భారత్ ఆర్మీ దళాలు పాక్ భూభాగంలోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొందనుకోవాలేమో? ఇదివరకు గుట్టు చప్పుడు కాకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చిన తరువాత ఆ విషయాన్ని కేంద్రప్రభుత్వం బయటపెట్టింది కనుక ఊహించని ఆ పరిణామానికి పాక్ సైన్యం ఏమీ చేయలేక, అసలు తమ భూభాగంలో భారత్ ఆర్మీ ప్రవేశించనే లేదని కనుక సర్జికల్ స్ట్రైక్స్ జరగనే లేదని బుకాయించింది. 

కానీ ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నామని భారత్ ముందే హెచ్చరిస్తోంది కనుక వాటిని ఎదుర్కోవడానికి అవతలివైపు పాక్ భారీ ఏర్పాట్లే చేసుకొని ఎదురుచూస్తుంటుందని చెప్పవచ్చు. కనుక ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే అది భారత్-పాక్ మద్య మినీ యుద్దం స్థాయిలోనే ఉండవచ్చుననే సంగతి కేంద్రం గ్రహించే ఉండాలి. 

సరిహద్దుల వద్ద చెలరేగిపోతున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంటే ఎవరూ అభ్యంతరం చెప్పకపోవచ్చు కానీ త్వరలో బిజెపి పాలిత రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక దీంతో ప్రజలలో సెంటిమెంటు రగిల్చి ఆ ఎన్నికలలో రాజకీయంగా పైచేయి సాధించడానికే ఈ ఆలోచన చేస్తే దానికి భారత్ ఆర్మీ భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మరిచిపోకూడదు.