సిఎం కెసిఆర్‌కు మోత్కుపల్లి బంపర్ ఆఫర్!

టిడిపి బహిస్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు యాదగిరిగుట్టలో ‘మోత్కుపల్లి  శంఖారావం’ పేరిట గురువారం ఒక బహిరంగసభ నిర్వహించారు. ఆయన జిల్లాలో ఆలేరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నందున ఈ సభ నిర్వహించారు. ఆలేరు ప్రజల ఆత్మగౌరవం కోసమే పోటీ చేస్తున్న తనను గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. తన జీవితంలో ఇవే చివరి ఎన్నికలు కనుక చివరిసారిగా తనను గెలిపించవలసిందిగా అభ్యర్ధించారు. ఆ తరువాత షరా మామూలుగా ఏపీ సిఎం కెసిఆర్‌ చంద్రబాబు నాయుడుపై కాసేపు నిప్పులు చెరిగారు. అనంతరం సిఎం కెసిఆర్‌ను ఉద్దేశ్యించి, “మిత్రమా ఈ ఎన్నికలలో నన్ను వాడుకొంటే నేను మీ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాలలోని టిఆర్ఎస్‌ అభ్యర్ధులను గెలిపించి ఇస్తాను,” అని అన్నారు.  

మోత్కుపల్లి నర్సింహులు ఒకపక్క తనను చివరిసారిగా గెలిపించాలని ఆలేరు నియోజకవర్గ ప్రజలను బ్రతిమాలుకొంటూనే, కావాలంటే జిల్లాలోని 12 స్థానాలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధులను గెలిపించి ఇస్తానని సిఎం కెసిఆర్‌కు ఆఫర్ ఇవ్వడం చూస్తే ఎవరైనా నవ్వుకోకమానరు. అదీ...కెసిఆర్‌ వంటి రాజకీయ దూరందరుడికి ఇటువంటి ఆఫర్ ఇవ్వడం ఇంకా నవ్వొస్తుంది. తన సీటు తాను గెలుచుకోగలనో లేదో తెలియక ప్రజలను బ్రతిమాలుకొంటున్న మోత్కుపల్లి టిఆర్ఎస్‌ అభ్యర్ధులను గెలిపిస్తానంటే విడ్డూరంగానే ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడును తిట్టి కెసిఆర్‌ను పడేద్దామనుకోవడం కూడా హాస్యాస్పదంగా ఉంది. అదే కనుక సాధ్యమైతే ఆయన ఇదివరకు టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేసేయాలన్నప్పుడు లేదా చంద్రబాబు నాయుడుని తిట్టిపోస్తున్నప్పుడే సిఎం కెసిఆర్‌ ఆయనను టిఆర్ఎస్‌లోకి తీసుకొని టికెట్ ఇచ్చి ప్రోత్సహించి ఉండేవారు కదా? కానీ ఎందుకు తీసుకోలేదు? అని ఆలోచించలేకపోయారు. మూడు దశాబ్ధాల రాజకీయ అనుభవంలో మోత్కుపల్లి  నేర్చుకొన్నది ఇంతేనా? పాపం మోత్కుపల్లి!