సుప్రీం కోర్టు మరో సంచలనతీర్పు

గత కొన్ని రోజులుగా సంచలన తీర్పులు వెలువరిస్తున్న సుప్రీం కోర్టు ఈరోజు మరో సంచలన తీర్పు వెలువరించింది. కేరళలోని శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించవచ్చునని తీర్పు చెప్పింది. మహిళల ఆలయ ప్రవేశంపై దశాబ్ధాలుగా అమలులో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని రంగాలలో స్త్రీపురుషులు సమానంగా ఉన్నప్పుడు స్త్రీల శారీరిక మార్పులను సాకుగా చూపి వారికి శబరిమలై ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేదం విధించడాన్ని సుప్రీం కోర్టు ధర్మాసనం తప్పు పట్టింది. మహిళా దేవతామూర్తులను పూజిస్తూ ఆలయాలలోకి మహిళలను అనుమతించకపోవడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించింది. ఇది మహిళల ప్రాధమిక హక్కును నిరాకరించడంగానే భావించవచ్చని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కనుక ఇక నుంచి అన్ని వయసుల మహిళలకు శబరిమలై ఆలయంలో ప్రవేశించి పూజలు చేసుకోవచ్చునని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పు చెప్పారు. 

కొన్ని రోజుల క్రితమే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. నిన్న మసీదులో నమాజు చేయడం తప్పనిసరికాదని చెప్పింది. అలాగే వివాహేతర సంబంధాలు ఇకపై నేరంగా పరిగణించబడవని తీర్పు చెప్పింది. ఈరోజు శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ సమాజం వీటిని అంగీకరిస్తుందా? అంటే అనుమానమే.