
మజ్లీస్ పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిర్మించ తలపెట్టిన ఓవైసీ ఆసుపత్రి కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం చాంద్రాయణగుట్ట సమీపంలోని బండ్లగూడలో 6,500 గజాల స్థలం కేటాయించింది. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేయాలి కానీ టిఆర్ఎస్-మజ్లీస్ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మజ్లీస్ అధినేతలకు అప్పనంగా కట్టబెట్టడం సరికాదని వాదిస్తూ ఒక పిటిషను దాఖలైంది. దానిపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఆ భూకేటాయింపుపై మూడు నెలలపాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూకేటాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను మూడు నెలలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మజ్లీస్ మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.