
నేడు తెలంగాణా శాసనమండలి సమావేశం కాబోతోంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ అధ్యక్షతన బిఏసి సమావేశం జరుగుతుంది. విధానసభ పనిదినాలు, ఈ సమావేశాలలో చర్చించవలసిన అంశాల అజెండాను ఖరారు చేస్తారు. అయితే ఈ సమావేశాలను ఇవాళ్ళ ఒక్క రోజుకే పరిమితం చేయాలని టిఆర్ఎస్ సర్కార్, కనీసం వారం రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పట్టు బడుతున్నట్లు భావిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించినట్లయితే ముందస్తు ఎన్నికల గురించి టిఆర్ఎస్ సర్కారును గట్టిగా నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
రాజ్యాంగం ప్రకారం గత సమావేశాలు ముగిసిన ఆరు నెలలోపు మళ్ళీ సమావేశాలు నిర్వహించవలసి ఉంటుంది కనుకనే ఇవాళ్ళ శాసనమండలి సమావేశం నిర్వహించవలసివస్తోంది. ఈరోజు సమావేశంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి, మాజీ లోక్‌సభ స్పీకర్ స్వర్గీయ సోమ్ నాధ్ చటర్జీ, మిమిక్రీ ఆర్టిస్ట్ స్వర్గీయ నేరెళ్ళ వేణుమాధవ్ లకు శ్రద్దాంజలి ఘటించిన తరువాత, కొండగట్టు ప్రమాదంలో చనిపోయినవారికి, కేరళ వరదలలో చనిపోయిన వారికి నివాళులు అర్పించి నేతితోనే ఈ సమావేశం ముగించాలని టిఆర్ఎస్ సర్కారు భావిస్తోంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ ఈరోజు శాసనమండలి సమావేశానికి హాజరవుతారు.