ఆధార్ మంచిదే....అవసరమే: సుప్రీంకోర్టు

ఇప్పుడు అన్నిటికీ ఆధారే ఆధారంగా మారింది. ఆధార్ చూపందే ఏ పనులు జరగని పరిస్థితి నెలకొంది. దీనివలన ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందని వాదిస్తూ దాఖలైన ఒక పిటిషనుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఏం ఖాన్ విల్కర్, జస్టిస్ ఏకే సిక్రీ సభ్యులుగా ఉన్న సుప్రీం ధర్మాసనం ఆధార్ పై తీర్పు వెలువరించింది. 

“ఆధార్ కార్డులు దేశంలో సామాన్య పౌరులకు, బడుగు బలహీనవర్గాల ప్రజలకు గుర్తింపునిస్తున్నాయి. కనుక జాతీయ గుర్తింపు వ్యవస్థ ఆధార్ దేశానికి చాలా అవసరమే. ఇది పూర్తిగా రాజ్యాంగబద్దమైనదే. ప్రజల వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడేందుకు ఆధార్ లో పటిష్టమైన భద్రతావ్యవస్థ ఉన్నప్పటికీ, దానిని మరింత పటిష్టపరచడానికి బలమైన చట్టం అవసరం. ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి, ఫ్యాన్ కార్డు నమోదుకు ఆధార్ తప్పనిసరి. కానీ బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్ పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదు. అలాగే స్కూళ్ళు, కాలేజీలలో ప్రవేశాలకు కూడా ఆధార్ తప్పనిసరి కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు అవసరమైనప్పుడు ఆధార్ నెంబరు, పేరు, చిరునామా వంటి వివరాలు కోరవచ్చు కానీ ఆధార్ వ్యవస్థలో నిక్షిప్తం చేయబడిన వ్యక్తుల డేటా కోరరాదు. ఆధార్ చట్టంలో సెక్షన్స్:  57, 33(2) లను రద్దు చేస్తున్నాము,” అని జస్టిస్ ఏకే సిక్రీ తీర్పు చదివి వినిపించారు. 

ఆధార్ వలన పౌరులకు గుర్తింపు లభిస్తోందన్న సుప్రీంకోర్టు అభిప్రాయం అక్షరాల నిజం. మరి అటువంటప్పుడు ఓటర్ కార్డులను ఆధార్ తో తప్పనిసరిగా అనుసంధానించాలని సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించి ఉంటే అందరూ హర్షించి ఉండేవారు. ఓటర్ కార్డులను ఆధార్ తో తప్పనిసరిగా అనుసంధానించినట్లయితే కోట్లాది నకిలీ ఓట్లు రద్దు చేయవచ్చు. తద్వారా ఎన్నికలలో మరింత ఖచ్చితత్వం, పారదర్శకత వస్తుంది కదా!