
పొన్నం ప్రభాకర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “నేను ఎంపీగానే ఉండటానికి ఇష్టపడుతున్నాను కానీ మా పార్టీ అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకొన్నా దానికి కట్టుబడి ఉంటాను,“ అని చెప్పారు.
అంటే ఈసారి ఎన్నికలలో ఆయనను శాసనసభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. పొన్నం ప్రభాకర్ ను శాసనసభకు పోటీ చేయించే ఉద్దేశ్యం ఉన్నందునే కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిందేమో?
ఈసారి రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు వేర్వేరుగా జరుగబోతుండటం కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రయోజనకరంగా ఉండబోతోందని చెప్పవచ్చు. ఈసారి శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ, పొన్నం ప్రభాకర్, జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, రేణుకా చౌదరి వంటి గెలుపు గుర్రాలను శాసనసభ ఎన్నికల బరిలో దింపడం ద్వారా అదనపు సీట్లు గెలుచుకొనే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలిగితే, తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికలలో కూడా విజయావకాశాలు పెరుగుతాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో పొన్నం ప్రభాకర్ వంటి మాజీ ఎంపీలు ఓడిపోయినా వారు మళ్ళీ తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికలలో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవచ్చు. కనుక ఈసారి మాజీ కాంగ్రెస్ ఎంపిలలో ఎంత మంది శాసనసభ ఎన్నికల బరిలో దిగుతారో చూడాలి.