
సెప్టెంబరు 6వ తేదీన సిఎం కెసిఆర్ టిఆర్ఎస్ 105 మంది అభ్యర్ధులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించారు. మూడు వారాలు గడిచినా ఇంకా పార్టీలో అసమ్మతి పొగలుసెగలు వెలువడుతూనే ఉన్నాయి. ఆ కారణంగా కొందరు అభ్యర్ధులను మార్చవచ్చునని మీడియాలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమస్యపై టిఆర్ఎస్ ఎంపి కవితను ప్రశ్నించగా, “ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించడంతో అసమ్మతి స్వరాలు వినిపించడం సహజమే. వారితో సిఎం కెసిఆర్ నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని సర్దుకొంటాయి. ఇక మొదటి జాబితాలో ప్రకటించిన అభ్యర్ధులను మార్చే ఉద్దేశ్యం మాకు లేదు. వారే ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. అభ్యర్ధులను మార్చాలని మా పార్టీలో వారి కంటే వారిని ఎదుర్కొని గెలవలేమనే భయంతో ప్రతిపక్షాలే మా అభ్యర్ధులను మార్చాలని ఎక్కువగా కోరుకొంటున్నాయి. అందుకే అవి మహా కూటమి పేరుతో అనైతిక పొత్తులు పెట్టుకొంటున్నాయి. అయితే గత నాలుగేళ్లలో మా ప్రభుత్వం చేసీనా రాష్ట్రాభివృద్ధి, చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలతో సంతృప్తిగా ఉన్న ప్రజలు మళ్ళీ మా పార్టీనే గెలిపించబోతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.