ఇక ఎన్నికలలో పోటీ చేయను: విహెచ్

సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంత రావు సోమవారం హటాత్తుగా తాను ఇక ఏ ఎన్నికలలోను పోటీ చేయనని ప్రకటించారు. అయితే తుదిశ్వాస విడిచేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, తనకు ఏ పదవులు ఇవ్వకపోయినా రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను గద్దె దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తన శక్తిమేర ప్రయత్నిస్తానని విలేఖరులకు చెప్పారు. 

కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారకమిటీ సారధ్య బాధ్యతలు తనకు అప్పగించనందుకు అసంతృప్తి, ఆవేధన వ్యక్తం చేసిన వి.హనుమంత రావు ఇంత హటాత్తుగా ఈ ప్రకటన చేయడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ, తనకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వలేదనే ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. కానీ కాంగ్రెస్‌ కమిటీలు ఏర్పాటు చేయకముందే ఆయన ఈ ప్రకటన చేసి ఉండి ఉంటే ఆయనకు ఏదో ఒక కీలకపదవి లభించి ఉండేదేమో? ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వి.హనుమంత రావుతో సహా కాంగ్రెస్‌ నేతలందరికీ మళ్ళీ పని ఉంటుంది లేకుంటే ఆయన వంటి అనేకమంది సీనియర్ నేతలు ఎలాగూ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవలసివస్తుంది.