ప్రణయ్‌కు విగ్రహమా...ఎందుకు?

ఇటీవల మిర్యాలగూడలో కిరాయి హంతకుడి చేతిలో దారుణహత్యకు గురైన ప్రణయ్ కుమార్ కు విగ్రహం ఏర్పాటు ప్రతిపాదన వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని సాగర్ నగర్ రోడ్డులో శకుంతల ధియేటర్ ఎదురుగా ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ స్థానంలో ప్రణయ్‌కు విగ్రహం ఏర్పాటు చేయడానికి స్థానిక దళిత సంఘాల నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టగా, దానిపై స్వచ్ఛంద సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక ఆర్డీఓ, డిఎస్పిలకు ఆదివారం ఫిర్యాదు చేశాయి. హత్యకు గురైన వ్యక్తి పేరిట కులాలు, మతాలు పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని, ఇటువంటి దుసంప్రదాయానికి అనుమతిస్తే మున్ముందు వీధివీధినా అనేక విగ్రహాలు పుట్టుకొస్తాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వాధిస్తున్నారు. పైగా పట్టణంలోని ప్రధానమార్గంలో సాగర్ నగర్ రోడ్డులో అనేకమంది జాతీయనేతల విగ్రహాలు ఉన్నాయని వాటి మద్య ఒక సాధారణ యువకుడైన ప్రణయ్ విగ్రహం పెట్టడం సముచితంకాదని వారు సూచిస్తున్నారు. అయితే అక్కడే ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేస్తామని స్థానిక దళిత, గిరిజన సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. వారితో ఆర్డీవో, స్థానిక అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.