ఏపీలో మావోయిస్టులు ఆదివారం మధ్యాహ్నం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఒక పధకం ప్రకారం కాపుకాసి పట్టుకొని కాల్చి చంపారు. వారిరువురూ విశాఖ జిల్లాలోని అరుకు నుంచి ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు సరాయి అనే గ్రామంలో జరుగుతున్న ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు వాహనాలలో బయలుదేరారు.
డుంబ్రిగుడ మండల కేంద్రాన్ని దాటి లివిటిపుట్టు అనే గ్రామం వద్ద సుమారు 60 మంది మావోయిస్టులు తుపాకులతో వారి వాహనాలను అడ్డగించి, ఇద్దరినీ తమతో సమీపంలో అడవులలోకీ తీసుకుపోయి కాల్చి చంపారు. వారిపై దాడి చేసినవారిలో సుమారు 35 మంది మహిళా మావోయిస్టులే ఉన్నట్లు సమాచారం. వారందరికీ ఒక మహిళా మావోయిస్ట్ నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది.
స్థానికంగా బాక్సైట్ త్రవ్వకాలు జరుగుతుంటే వాటిని ఆ ఇద్దరూ అడ్డుకొనే ప్రయత్నాలు చేయకపోవడం, స్థానికులు అభ్యంతరాలు చెపుతున్నా హుకుంపేట మండలంలోని గూడ గ్రామంలో నల్లరాయి, కాల్సైట్ అక్రమ మైనింగ్ చేస్తుండటం, తమ కదలికల గురించి పోలీసులకు సమాచారం అందిస్తున్నారని ఆరోపిస్తూ వారిని మావోయిస్టులు కాల్చి చంపారు. వారి హత్యలతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే అనుచరులు, స్థానిక గిరిజనులు అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి స్టేషన్లోని ఫర్నీచర్, అక్కడే ఉన్న వాహనాలను ద్వంసం చేసి వాటికి నిప్పు పెట్టారు.