4.jpg)
మంత్రి కేటీఆర్ ఈరోజు తన స్వంత నియోజకవర్గం వర్గమైన సిరిసిల్లలోని ఎల్లారెడ్డిపేటలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈ నాలుగేళ్ళలో నా శక్తిమేర పనిచేసి సిరిసిల్ల రూపురేఖలు మార్చేయగలిగాను. ఇప్పుడు జిల్లాలో మారుమూల గ్రామాలు సైతం ఎంతగా అభివృద్ధి చెందాయో మీరందరూ స్వయంగా చూస్తూనే ఉన్నారు. త్వరలో జరుగబోయే ఎన్నికలలో సిరిసిల్ల నుంచి నాపై పోటీ చేయబోతున్న ఇతర పార్టీల నేతలలో ఎవరైనా నాకంటే సిరిసిల్లను బాగా అభివృద్ధి చేయగలరని మీరు భావించినట్లయితే తప్పకుండా వారికే ఓటు వేసి గెలిపించండి. ఎందుకంటే, ఎవరు అభివృద్ధి చేసి చూపిస్తారో వారినే ఎన్నుకోవడం చాలా అవసరం. నాకు తెలిసినంతవరకు ప్రతిపక్షాలలో అటువంటి అభ్యర్ధులున్నారని నేను అనుకోవడం లేదు.
ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న అభివృద్ధి ఫలాలలో, సంక్షేమ పధకాలలో సిఎం కెసిఆర్ కృషి అణువణువునా కనిపిస్తుంటుంది. మనం కట్టుకొంటున్న కాళేశ్వరం, సీతారామ మొదలైన ప్రాజెక్టులను అడ్డుకొనే చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి మీముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే భవిష్యత్ లో ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏమవుతుందో మీరే ఆలోచించాలి.
కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలనన్నిటినీ అమలుచేయాలంటే దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ అంతా కలిపినా సరిపోదు. కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకోవడం కోసమే అటువంటి ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని అందరూ గుర్తుంచుకోవాలి. మన రాష్ట్రం ఇదేవిధంగా అన్ని రంగాలలో స్థిరంగా అభివృద్ధి సాగించాలంటే మళ్ళీ టిఆర్ఎస్నే గెలిపించుకోవలసి ఉంది. ఒకవేళ సిరిసిల్లలో నేను చేసిన అభివృద్ధి పనులు మీ అందరికీ సంతృప్తి కలిగించినట్లయితే నన్ను భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ మీకు సేవ చేసే అవకాశం ఇమ్మని కోరుతున్నాను,” అని కేటీఆర్ కోరారు.
ప్రజలను ఓట్లు అడుగుతున్న రాజకీయ నాయకుడు ఇంత ధైర్యంగా “నాకంటే గొప్పగా పనిచేయగలవారు ఉన్నారని మీరు భావిస్తే వారికే ఓటేసి గెలిపించుకోండి,” అని చెప్పగలగడం బహుశః కేటీఆర్కే సాధ్యమేమో! సిరిసిల్ల అభివృద్ధి... అక్కడి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం కేటీఆర్ ఎంతగా కృషి చేశారో ప్రజలందరికీ తెలుసు. కనుకనే కేటీఆర్ అంత ఆత్మవిశ్వాసంతో ఆవిధంగా అనగలిగారు. సిరిసిల్లాలో ఆయనపై ప్రతిపక్షాలు ఎంత బలమైన అభ్యర్ధిని నిలబెట్టినప్పటికీ, కేటీఆర్ ను ఓడించడం అసంభవమేనాని చెప్పవచ్చు. కేటీఆర్ ఈసారి ఎంత మెజారిటీతో గెలుస్తారనేదే లెక్క తేలాలి.