
సిఎం కెసిఆర్ ఒకేసారి 105 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించడం చూసి ప్రతిపక్షాలు షాక్ అయినప్పటికీ, టిఆర్ఎస్కు ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా మారింది. ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకె మళ్ళీ టికెట్లు ఇస్తానని సిఎం కెసిఆర్ చాలా రోజుల నుంచే చెపుతున్నప్పటికీ, టిఆర్ఎస్లో చాలా మంది నేతలు ఈసారి తమకు తప్పకుండా టికెట్ లభిస్తుందని ఆశగా ఎదురుచూశారు. కానీ సిఎం కెసిఆర్ చెప్పినట్లుగానే మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకె టికెట్లు కేటాయించడంతో టికెట్లు ఆశిస్తున్నవారికి తీవ్ర నిరాశ చెందారు. ఆ అసంతృప్తి అసమ్మతిగా మారి సర్వత్రా సెగలు గక్కుతోందిప్పుడు.
సుమారు రెండున్నరేళ్ళ క్రితం టిడిపి నుంచి టిఆర్ఎస్లో చేరిన తీగల కృష్ణారెడ్డికి మహేశ్వరం టికెట్ ఖరారు చేయడంతో ఆ టికెట్ ఆశిస్తున్న కొత్త మనోహర రెడ్డి అనుచరులు మంగళవారం కొత్తపేట జాతీయ రహదారిపై బైటాయించి రాస్తా రోకో చేసి తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ మహేశ్వరం యూత్ అధ్యక్షుడు శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, “తీగల కృష్ణారెడ్డి ఈ నియోజకవర్గానికి, పార్టీకి ఏమి చేశారని ఆయనకు టికెట్ ఇచ్చారు? మొదటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తున్న మా నాయకుడు కొత్త మనోహర రెడ్డిని కాదని ఆయనకు టికెట్ ఇవ్వడం మాకు చాలా బాధ కలిగించింది. ఒకవేళ మా నాయకుడికి టికెట్ ఇవ్వన్నట్లయితే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించి సిఎం కెసిఆర్‌కు బహుమతిగా అందజేస్తాము. కనుక తీగల కృష్ణారెడ్డికి ఇచ్చిన టికెట్ ను మా నాయకుడికే కేటాయించాలి,” అని అన్నారు.