
రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు రెండు కీలకమైన పదవులు (ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి) పొందిన టి.రాజయ్య జాక్-పాట్ కొట్టాడని అందరూ అనుకొన్నారు. కానీ ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సిఎం కెసిఆర్ ఆయనను వెంటనే ఆ పదవుల నుంచి తప్పించేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఆయనకు ఎటువంటి పదవులు ఇవ్వకపోవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లేనని అందరూ అనుకొన్నారు. కానీ ఆశ్చర్యకరంగా కెసిఆర్ ప్రకటించిన టిఆర్ఎస్ అభ్యర్ధుల మొదటి జాబితాలోనే రాజయ్య పేరు ఉంది. ఆయనకు స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి టికెట్ ఖరారు చేశారు.
కానీ టికెట్ ఖరారయి వారం రోజులు కూడా కాకమునుపే నాని అనే ఒక మహిళతో ఫోన్లో చేసిన సరసాలు బయటకు పొక్కడంతో రాజయ్య పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. మీడియాలో వచ్చిన ఈ వార్తలపై రాజయ్య స్పందించేలోపుగానే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని దేశాయితండా చెందిన సూదుల రత్నాకర్ రెడ్డి, జెడ్.పి.టి.సి. భూక్యా స్వామి నాయక్, రఘునాధపల్లి ఎంపిపి దాసరి అనిత తదితరులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ‘రాసలీలల రాజయ్య మాకొద్దు’ అని చెప్పేశారు.
టిఆర్ఎస్ నేత రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ, “ఉప ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ పదవి కోల్పోయారు. కానీ ఆయన తీరు మారలేదు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. పైగా మహిళలతో అక్రమసంబంధాలు పెట్టుకొని రాసలీలలు కూడా నెరుపుతునట్లు ఇప్పుడు బయటపడింది. అటువంటి వ్యక్తి టికెట్ ఇవ్వడం వలన పార్టీకి చెడ్డపేరు వస్తుంది. ఎన్నికలలో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. కనుక అతనికిచ్చిన టికెట్ వెనక్కు తీసుకోవాలని మేము మా పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నాము,” అని అన్నారు.
మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై రాజయ్య స్పందిస్తూ, “నాకు ఏ మహిళతో సంబందం లేదు. నేను ఎవరితోనూ ఫోన్లో ఆవిధంగా మాట్లాడలేదు. నాకు మహిళలు అంటే చాలా గౌరవం. ఇదంతా నేనంటే గిట్టనివారు ఎవరో చేస్తున్న కుట్ర అని భావిస్తున్నాను. నేను నిర్ధోషిని. త్వరలోనే నిజానిజాలు బయటపడతాయి,” అని అన్నారు.