
రాష్ట్రంలో ఎన్నికల గంట మొగడంతో టికెట్లు ఆశిస్తున్నవారు, ఆశించి భంగపడినవారు పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టారు. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలు గులాబీ కండువాలు కప్పుకోవడానికి సిద్దం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేత పద్మయ్య బుధవారం సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు తాజా సమాచారం. వారిలో పద్మయ్య చొప్పదండి నుంచి టిఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.
టిఆర్ఎస్ ఇప్పటికే 105 మంది అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసింది. మిగిలిన స్థానాలకు కూడా పార్టీలో చాలా మంది పోటీ పడుతున్నారు. కనుక ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్‌లోకి కొత్తగా వచ్చేవారికి టికెట్స్ లభించడం కష్టమే. ఈ సంగతి తెలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇంకా తొలి జాబితా విడుదల చేయకముందే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు టిఆర్ఎస్‌లో చేరుతుండటం చాలా ఆశ్చర్యకరమే. సరిగ్గా ఎన్నికలకు ముందు సీనియర్లు పార్టీని వెళ్ళిపోవడం వలన కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టమే కానీ అదే సమయంలో టిఆర్ఎస్‌లో టికెట్లు లభించనివారు కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరే అవకాశం ఉంది కనుక వారితో బ్యాలెన్స్ కావచ్చు.