ఉద్యమకారులను కాదని టికెట్ ఇస్తే...

శనివారం మధ్యాహ్నం కొండా సురేఖ దంపతులు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి సిఎం కెసిఆర్‌, మంత్రి కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేశారు. ఊహించినట్లుగానే టిఆర్ఎస్‌ నుంచి వారికి చాలా ఘాటుగా సమాధానం లభించింది. టిఆర్ఎస్‌ నేతలు ఎమన్నారంటే.... 

ఎంపీ పసునూరి ప్రభాకర్: 2014 ఎన్నికలకు ముందు రాజకీయ భిక్ష పెట్టమని కొండా దంపతులు సిఎం కెసిఆర్‌ను ఆశ్రయిస్తే, ఆయన ఉద్యమకారులను పక్కనపెట్టి చాలా ఉదారహృదయంతో ఆమెకు టికెట్ ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. చాలా అహంకారంతో వ్యవహరించేవారు. ఇక ఆమె భర్త కొండా మురళి మా స్వంత పార్టీ కార్పొరేటర్లనే బెదిరిస్తుండేవారు. వారి తీరు చూసి అందరం విసిగిపోయాము. కానీ పైకి చెప్పుకొంటే పార్టీ పరువుపోతుందని మౌనంగా భరించేవాళ్ళం. 

గుండు సుధారాణి: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడుకొని ఇప్పుడు అడిగినన్ని సీట్లు ఇవ్వలేదనే వంకతో కెసిఆర్‌పై విమర్శలు చేయడం తగదు. ఒకప్పుడు ఆయనే మీకు రాజకీయ భిక్ష పెట్టారనే సంగతి మరిచిపోకూడదు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టిఆర్ఎస్‌ తరపున ఎవరిని నిలబెట్టినా సునాయసంగా గెలుస్తారు. సురేఖ గెలవడం గొప్ప విషయమేమీ కాదు.

బండ ప్రకాష్: కొండా దంపతులు పార్టీతో సంబందంలేకుండా పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలలో పర్యటిస్తూ అక్కడ మేమే పోటీ చేయబోతున్నామని ప్రకటించుకోవడం వాస్తవం కాదా? వరంగల్ లో మీరిరువురూ కలిసి పార్టీని చీల్చేందుకు  గ్రూపు రాజకీయాలు చేయడం వాస్తవమా కాదా? పార్టీ కోసం చాలా కష్టపడ్డామంటున్నారు. మరి ప్రగతి నివేదన సభకు మీ తరపున ఎంతమందిని పంపించారో చెప్పగలరా? 

వినయ్ కుమార్: కొండా దంపతులవన్నీ చీకటి వ్యాపారాలే. వారు తమతో టచ్చులో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కాలం క్రితమే చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన కుదుర్చుకొని రాజకీయ భిక్ష పెట్టిన టిఆర్ఎస్‌నే మోసం చేస్తున్నారు కొండ దంపతులు. కొండా మురళి తక్షణం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి.