
ఈరోజు హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి సిఎం కెసిఆర్‌పై విమర్శలు గుప్పించిన టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు ఒక సవాలు కూడా విసిరారు. “మీరు మొన్న ప్రకటించిన 105 మంది అభ్యర్ధులకు తప్పకుండా బి-ఫార్మ్స్ ఇస్తానని ప్రకటించగలరా? ఎందుకంటే నామినేషన్స్ వేసేలోగా వారిలో చాలా మందిని మార్చేయవచ్చు. కనుక మీరు ప్రకటించిన జాబితాలో ఉన్న 105 మంది అభ్యర్ధులకు మాటతప్పకుండా బి-ఫార్మ్స్ ఇస్తానని ప్రకటిస్తే వారికీ నమ్మకం కలుగుతుంది,” అని కొండా సురేఖ అన్నారు.
ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంపై కూడా కొండా సురేఖ తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. “ప్రజలు మనల్ని 5 ఏళ్ళు పాలించమని ఎన్నుకొన్నారు. మన ప్రభుత్వం పట్ల ప్రజలకు మంచి అభిప్రాయమే ఉందని మీరే స్వయంగా చెప్పారు. మరి అటువంటప్పుడు 9 నెలలు ముందుగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లవలసిన అవసరం ఏమిటి? అది ప్రజల తీర్పును అపహాస్యం చేయడమే కదా? ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే మీ నిర్ణయంతో ప్రభుత్వం గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపారని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
ఇక మంత్రి కేటీఆర్ గురించి కూడా ఆమె చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “కేవలం ఆయన కారణంగానే నాకు టికెట్ రాలేదని నేను భావిస్తున్నాను. పార్టీలో పెద్ద కుట్ర జరుగుతోంది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తన మంత్రివర్గంలో అందరూ తనకు అనుకూలమైన వాళ్ళు మాత్రమే ఉండాలని భావిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నా వంటి నేతలను ఈవిధంగా పక్కకు తప్పించేస్తున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్ కోటరీ ఏర్పాటై ఉంది. అదే నావంటి నేతలను మెల్లగా పక్కకు తప్పించేస్తోంది,” అని కొండా సురేఖ ఆరోపించారు.
తనకు 24 గంటలలోగా టికెట్ ఇవ్వకపోతే వరంగల్ ఈస్ట్, పరకాల, భూపాలపల్లి మూడు నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేస్తానని కొండా సురేఖ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అయితే ఆమె కధ ఇంతవరకు వచ్చేశాక ఇక ఆమె ఇంకా టిఆర్ఎస్‌లో కొనసాగడం, టికెట్ దక్కడం రెండూ అసంభవమేనని అర్దమవుతూనే ఉంది. కనుక బంతి ఇప్పుడు కొండా కోర్టులోనే ఉన్నట్లు చెప్పవచ్చు.