శాసనసభ రద్దును వ్యతిరేకిస్తూ పిటిషన్

హైదరాబాద్‌కు చెందిన రాపోలు భాస్కర్ అనే న్యాయవాది తెలంగాణా శాసనసభ రద్దును సవాలు చేస్తూ శుక్రవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించడానికి ప్రజలు టిఆర్ఎస్‌ సర్కారును ఎన్నుకొంటే, 9 నెలల ముందుగానే బలమైన కారణం ఏదీ చూపకుండా తమ ఇష్టానుసారం శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం రాజ్యాంగ విరుద్దమని పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే శాసనసభ రద్దుకు  మంత్రివర్గం నిర్ణయం, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం మొదలైన చర్యలన్నీ రాజ్యాంగ విరుద్దమైనవేనని పిటిషనర్ వాదన.

ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల కమీషన్ కూడా ముందస్తు ఎన్నికల నిర్వహణకు సిద్దం అవుతోందని కనుక ముందస్తు ఎన్నికలు నిర్వహించకుండా ఈసీని ఆదేశించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వలన ఇప్పుడొకసారి, మళ్ళీ లోక్‌సభ ఎన్నికలు మరొకసారి నిర్వహించవలసి వస్తుంది కనుక వేలకోట్ల ప్రజాధనం వృధా అవుతుందని కనుక ఈ ముందస్తు ఎన్నికలను ఆపవలసిన అవసరం ఉందని న్యాయస్థానాన్ని కోరారు. ఆయన పిటిషనును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దానిపై మంగళవారం విచారించవచ్చునని సమాచారం.