అందులో దాపరికం ఎందుకు? కెసిఆర్‌

టిఆర్ఎస్‌-మజ్లీస్ పార్టీల మద్య స్నేహబందం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు సిఎం కెసిఆర్‌ సమాధానం చెపుతూ, “యస్... మజ్లీస్ పార్టీ మాకు మిత్రపార్టీయే. టిఆర్ఎస్‌-మజ్లీస్ పార్టీల మద్య బలమైన దోస్తీ ఉంది. కనుక వచ్చే ఎన్నికలలో కూడా మేము కలిసే సాగుతాము. అందులో దాపరికం ఎందుకు?” అని సిఎం కెసిఆర్‌ ఎదురు ప్రశ్నించారు. అయితే కొన్ని స్థానాలలో రెండు పార్టీల మద్య స్నేహపూర్వకమైన పోటీ కూడా ఉండవచ్చని సిఎం కెసిఆర్‌ చెప్పారు. మజ్లీస్ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నప్పటికీ తమది సెక్యులర్ పార్టీ అని సిఎం కెసిఆర్‌ చెప్పారు. 

కేంద్రప్రభుత్వంతో రహస్య అవగాహన, బిజెపితో ఎన్నికల పొత్తుల గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, “మజ్లీస్ పార్టీతో పొత్తులు పెట్టుకొన్న మా పార్టీతో స్నేహం, పొత్తులు అవసరం లేదని సాక్షాత్ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ఇంకా బిజెపితో పొత్తులు, రహస్య అవగాహన ఊసెక్కడిది?ఇక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మద్య ఉన్న బందం రాజ్యాంగ బందమే తప్ప రాజకీయ బందం కాదు. కేంద్రంలో ప్రధాని మోడీ స్థానంలో ఎవరున్నా వాళ్ళు డిల్లీ రమ్మని పిలిస్తే ఇష్టం ఉన్నా లేకపోయినా పోవలసిందే. తప్పదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళతో సత్సంబంధాలు నెరపడం అవసరం. కానీ అంతమాత్రన్న రాష్ట్రంలో బిజెపితో పొత్తులు పెట్టుకొంటామనుకోవడం సరికాదు. అయినా మాకు బిజెపితో పొత్తులు పెట్టుకోవలసిన అవసరం ఏముంది? వాళ్లోక గరీబుగాళ్ళు పాపం. కనుక వాళ్ళు నోటికి వచ్చిందేదో చెప్పుకొని కాలక్షేపం చేస్తుంటారు. వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు కాదనాలి? వచ్చే ఎన్నికలలో వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుచుకొంటే చాలు. కానీ అది కూడా డౌటే,” అని అన్నారు.