దిగిపోతూ కూడా అబద్దాలే చెప్పారు!

నెహ్రూ కుటుంబీకులపై, ముఖ్యంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సిఎం కెసిఆర్‌ నిన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “కెసిఆర్‌కు పోయే కాలం వచ్చి శాసనసభను రద్దు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం వలన ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. నిత్యం మాయమాటలు, అబద్దాలు చెపుతూ కాలక్షేపం చేసే సిఎం కెసిఆర్‌ దిగిపోతూ కూడా అబద్దాలే చెప్పారు. రాష్ట్రాభివృద్ధి గురించి ఆయన చెప్పినవన్నీ అబద్దాలే. రైతుల ఆత్మహత్యలు, లిక్కర్ అమ్మకాలలో, అప్పులలో తెలంగాణా రాష్ట్రాన్ని సిఎం కెసిఆర్‌ నెంబర్: 1 స్థానంలో నిలిపారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిన కెసిఆర్‌ మళ్ళీ కొత్త హామీలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారు.              

తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీల గురించి సిఎం కెసిఆర్‌ అన్నమాటలు ఆయన అహంకారానికి అద్దం పడుతున్నాయి. వాటిని మేము ఖండిస్తున్నాము. ఆయనకు రాబోయే ఎన్నికలో ప్రజలే గట్టిగా బుద్ది చెపుతారు. ఈ ఎన్నికలు టిఆర్ఎస్‌-కాంగ్రెస్ పార్టీల మద్య జరుగుతున్నవి కావు. నలుగురు కెసిఆర్‌ కుటుంబ సభ్యులకు నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలకు మద్య జరుగుతున్నవి. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.