
సిఎం కెసిఆర్ నిన్న శాసనసభను రద్దు చేసిన తరువాత తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, దాని అధినేతలను ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన చీడ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ మొదలు నేడు రాహుల్ గాంధీ వరకు అందరూ తెలంగాణాకు అన్యాయం చేసినవాళ్ళే. దేశంలో, రాష్ట్రంలో సకల దరిద్రాలకు కారణం కాంగ్రెస్ పార్టీయే. అది దారిద్రానికి, అవినీతి, అసమర్ధతకు రిజర్వ్ బ్యాంక్ వంటిది. దాని పీడ విరగడయితే కానీ దేశం, రాష్ట్రం బాగుపడవు. ఈ నాలుగేళ్లలో తేరుకొని అభివృద్దిపధంలో దూసుకుపోతున్న తెలంగాణా రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పడిందంటే రాష్ట్రం పరిస్థితి కుక్కలు చించిన విస్తరి అవుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచాలని నేను రాష్ట్ర ప్రజలకు విజ్నప్తి చేస్తున్నాను.
రాహుల్ గాంధీ దేశ రాజకీయాలలో ఒక పెద్ద బఫూన్ వంటివాడు. పార్లమెంటులో ఆయన ఏమి చేశారో అందరూ చూశారు కదా? వెళ్ళి ప్రధాని మోడీ కౌగలించుకొని వచ్చి కన్నుకొట్టాడు. అటువంటి బఫూన్ ను చూసి మేము భయపడుతున్నామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం చూస్తే నవ్వొస్తుంది. ఆయన రాష్ట్రానికి ఎన్నిసార్లు వస్తే అంత మాపార్టీకి మేలు జరుగుతుంది.
ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.ఆ భయంతోనే అది టిడిపితో పొత్తులకు సిద్దపడుతోంది. తెలంగాణా అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న టిడిపితో పొత్తులు పెట్టుకొంటే అంతకంటే సిగ్గుపడాల్సిన విషయం మరొకటి ఉంటుందా? దాని వలన దానికే ఇంకా నష్టం అని ఖచ్చితంగా చెప్పగలను.
పరాయి పాలన వద్దనే కదా మనం పొరాడి తెలంగాణా సాధించుకొన్నాము. కానీ టిడిపితో పొత్తులు పెట్టుకొని మళ్ళీ రాష్ట్రంలో ఆంద్రాపాలన మొదలుపెడతామంటే తెలంగాణా ప్రజలు అంగీకరిస్తారా?కాంగ్రెస్ పార్టీకి పెత్తనం ఇస్తే డిల్లీ నుంచి పాలన జరుగుతుంది. తెలంగాణా ప్రజలు మళ్ళీ డిల్లీకి గులాములుగా బ్రతకాలి. అందుకు వారు అంగీకరిస్తారా? మన రాష్ట్రం కోసం మనమే మన గడ్డ మీద నిర్ణయాలు తీసుకోవాలి. కాదని డిల్లీకో, ఆంద్రా పాలకులకో మళ్ళీ పెత్తనం అప్పగిస్తే తెలంగాణా సాధించి ప్రయోజనం ఉండదు,” అని సిఎం కెసిఆర్ అన్నారు.