ఆ విషయంలో కూడా టిఆర్ఎస్‌యే ఫస్ట్

నేటి నుంచి సిఎం కెసిఆర్‌ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టబోతున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్‌లో తొలి భారీ బహిరంగసభతో ఎన్నికల ప్రచారం మొదలుపెడతారు. నిన్న సాయంత్రమే గజ్వేల్ చేరుకొన్న సిఎం కెసిఆర్‌ ఈరోజు కోనాయపల్లిలో వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. గజ్వేల్ నుంచి హెలికాఫ్టరులో మధ్యాహ్నం 2.30గంటలకు హుస్నాబాద్ చేరుకొంటారు. సభ ముగిసిన తరువాత హెలికాఫ్టరులో హైదరాబాద్‌ చేరుకొంటారు. 

శాసనసభ రద్దు, ముందస్తు ఎన్నికలపై సస్పెన్స్ కు తెర దించారు కనుక ఇక నేటి నుంచి ఎన్నికల ప్రచారకార్యక్రమాలపైనే దృష్టి పెట్టవచ్చు. సాధారణంగా ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచారంలో ముందుంటాయి. కానీ ఈ విషయంలో కూడా టిఆర్ఎస్‌యే ముందుండటం విశేషం. రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున 50 రోజుల పాటు ఏకధాటిగా బహిరంగసభలు నిర్వహిస్తానని సిఎం కెసిఆర్‌ స్వయంగా చెప్పారు. కనుక ఇక టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలకు చేతినిండా పనే.