తెలంగాణా శాసనసభ రద్దు

తెలంగాణా శాసనసభను రద్దు చేస్తూ మంత్రివర్గం తీసుకొన్న నిర్ణయానికి గవర్నర్ నరసింహన్‌ కొద్ది సేపటి క్రితం ఆమోదం తెలిపారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రగతి భవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశం కేవల్మ్ 4 నిమిషాలలోనే ముగిసింది. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించిన తరువాత సిఎం కెసిఆర్‌ తన మంత్రులతో కలిసి రాజ్ భవన్ వెళ్ళి గవర్నర్ నరసింహన్‌కు ఆ తీర్మానం ప్రతిని అందజేసి ఆయన ఆమోదముద్ర వేయించుకొన్నారు. ఆనవాయితీ ప్రకారం మళ్ళీ ప్రభుత్వం ఏర్పడేవరకు కెసిఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ నరసింహన్‌ కోరారు. 

గవర్నర్ నరసింహన్‌తో సమావేశం ముగియగానే సిఎం కెసిఆర్‌, మంత్రులు అందరూ నేరుగా తెలంగాణా భవన్ కు బయలుదేరారు. మరికాసేపటిలో సిఎం కెసిఆర్‌ అక్కడ మీడియా సమావేశం నిర్వహించి శాసనసభను ఎందుకు రద్దు చేసిందీ వివరించబోతున్నారు. అప్పుడే టిఆర్ఎస్‌ అభ్యర్ధుల తొలి జాబితా కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.