
నెల రోజుల క్రితం సిఎం కెసిఆర్ ఏదో యధాలాపంగా అన్నట్లు ‘అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ధామా?’ అని ప్రతిపక్షాలకు సవాలు విసిరినప్పుడు, అవి ఆయన మాటలను ఏవిధంగా తిప్పికొట్టాలని చూశాయే తప్ప ఆయన అన్నంత పనీ చేస్తారనుకోలేదు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలు తెలంగాణా ముంగిట్లోకి వచ్చేశాయి. కానీ కారణాలు ఏమిటో టిఆర్ఎస్ నేతలు ఎవరూ చెప్పకపోవడం చేత రాజకీయ విశ్లేషకులే శ్రమనుకోకుండా వివరిస్తున్నారు.
ముందస్తు ఎన్నికల ఆలోచనకు అనేక కారణాలు కనబడుతున్నాయి. అవేమిటంటే...
1. పార్లమెంటు ఎన్నికలతో కలిపి శాసనసభ ఎన్నికలు నిర్వహించినట్లయితే, ఎన్నికలలో జాతీయ అంశాలపై కూడా చర్చ జరుగుతుంది. అదే...శాసనసభకు మాత్రమే ఎన్నికలు జరిగితే వాటిలో టిఆర్ఎస్ సర్కారు చేపట్టిన పలుఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి గట్టిగా చెప్పుకొని ప్రజలను మెప్పించి, ప్రతిపక్షాలను సులువుగా ఓడించవచ్చు.
2. కాంగ్రెస్, బిజెపిలకు ఎంతో కీలకమైన మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలతో కలిసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన్నట్లయితే, ఆ రెండు పార్టీల అగ్రనేతలు తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించలేరు కనుక టిఆర్ఎస్ కాంగ్రెస్, బిజెపిలపై ఇంకా సులువుగా పైచేయి సాధించవచ్చు.
3. ముందస్తు ఎన్నికలలో విజయం సాధిస్తే ఆ ప్రభావం ఆ తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికలపై కూడా పడుతుంది. అప్పుడు వాటిలో కూడా టిఆర్ఎస్ అవలీలగా విజయం సాధించే అవకాశం ఉంది.
4. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాదిలో ఎన్నికలకు వెళ్లిన్నట్లయితే ఈలోగా రాష్ట్రంలో కాంగ్రెస్-టిడిపిలు పొత్తులు కుదుర్చుకొని బలపడే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్‌తో పొత్తులకు తెలంగాణా జనసమితిని ఒప్పించడానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడవచ్చు. ఆ కారణంగా కాంగ్రెస్ మిత్రపక్షాలను ఓడించడానికి మరింత శ్రమపడవలసి ఉంటుంది.
5. సమయం గడుస్తున్న కొద్దీ పార్టీల బలాబలాలు, సమీకరణాలలో మార్పులు రావచ్చు. ప్రతిపక్షాలు ఎన్నికలకు పూర్తిగా సిద్దంగా లేనప్పుడే వాటిని అయోమయంలో ఉంచి హటాత్తుగా ఎన్నికలకు వెళ్ళినట్లయితే అవలీలగా ఓడించవచ్చునని కెసిఆర్ భావిస్తుండవచ్చు.
6. సార్వత్రిక ఎన్నికల వరకు ఆగినట్లయితే సమయం గడుస్తున్న కొద్దీ టిఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలతో కొత్త ఇబ్బందులు ఎదురవవచ్చు. కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే అన్ని విధాలా మంచిదని సిఎం కెసిఆర్ భావించి ఉండవచ్చు.