
రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ గెలుస్తుందని టిఆర్ఎస్ నేతలు చెప్పుకొంటే ఆశ్చర్యం లేదు కానీ బిజెపికి చెందిన కేంద్రమంత్రి చెప్పడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈసారి రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి అధికారం చేజిక్కించుకొంటామని చెప్పుకొంటున్న రాష్ట్ర బిజెపి నేతలకు కేంద్రమంత్రి చేసిన ఈ ప్రకటన పెద్ద షాక్ వంటిదే. కేంద్రమంత్రి రాందాస్ అధవాలే మంగళవారం కామారెడ్డిజిల్లాలో పర్యటించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో మళ్ళీ టిఆర్ఎస్యే గెలిచి అధికారంలోకి వస్తుంది. కెసిఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోడీ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు,” అని అన్నారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా రాష్ట్రంలో ఈసారి బిజెపి గెలిచి అధికారంలోకి వస్తుందని ఒకవేళ గెలవలేకపోయినా కింగ్ మేకర్ గా నిలుస్తుందని రాష్ట్ర బిజెపి నేతలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో బిజెపికి అండగా తాను నిలబడి పార్టీని విజయపధంలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు కూడా. అందుకే ఆయన ఈ నెల 12 లేదా 13లలో పాలమూరు పట్టణంలో జరుగబోయే బిజెపి తొలి ఎన్నికల ప్రచారసభకు హాజరుకాబోతున్నారు. రాష్ట్ర బిజెపి నేతలు టిఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి రాగలమని ధీమా వ్యక్తం చేస్తుంటే, కేంద్రమంత్రి టిఆర్ఎస్యే మళ్ళీ గెలుస్తుందని, కెసిఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం వాస్తవ పరిస్థితులను చాటిచెప్పినట్లయింది. మరి రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఏమంటారో?