గెడ్డం పెంచినవాళ్ళందరూ గబ్బర్ సింగ్ కారు: కేటీఆర్

ప్రగతి నివేదన సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు తరలిరాకపోవడం, సభలో సిఎం కెసిఆర్‌ ప్రసంగం చాలా చప్పగా సాగడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చి సిఎం కెసిఆర్‌ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. వాటికి మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ఘాటుగా జవాబు ఇచ్చారు.

తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “ప్రగతి నివేదన సభలో సిఎం కెసిఆర్‌ ఏమి చెపుతారోనని ప్రజలే కాదు...ప్రతిపక్షాలు కూడా చాలా ఆసక్తిగా చూశాయి. అది ప్రగతి నివేదన సభ కనుక గత నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏమేమి పనులు చేసిందో సిఎం కెసిఆర్‌ చెప్పారు. ఆ సభలో సిఎం కెసిఆర్‌ కాంగ్రెసోళ్ళను ఒక్క ముక్క కూడా అనకపోవడంతో వాళ్ళు చాలా బాధపడినట్లున్నారు. వాళ్ళను సన్నాసులు, దద్దమ్మలు అని తిట్టకపోవడంతో చాలా నిరాశకు గురైనట్లున్నారు.  కనీసం మేము అందుకు కూడా నోచుకోలేదా? అని బాధపడినట్లున్నారు. అందుకే సభ చాలా చప్పగా సాగిందని, ఫ్లాప్ అయ్యిందని వాదించారు. 

సిఎం కెసిఆర్‌ను ఎవరు ఎక్కువగా తిట్టిపోస్తే వారికే పార్టీ టికెట్లు, ముఖ్యమంత్రి పదవి ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారో ఏమో తెలియదు.  కాంగ్రెస్ పార్టీలో ఒక డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్ధులున్నారు. వారందరూ పోటీలు పడి మరీ ముఖ్యమంత్రిని తిట్టిపోశారు. ఇక టిఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెడ్డం గీసుకోనంటే మాకేమి నష్టం? అయినా గెడ్డం పెంచినవాళ్ళందరూ గబ్బర్ సింగ్ కారు కదా?

ఇక సిఎం కెసిఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు. సిఎం కెసిఆర్‌ను ఎందుకు గద్దె దింపాలి? అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నందుకా లేక కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ పాలనలో చేయలేని పనులన్నిటినీ పూర్తిచేసి చూపిస్తున్నందుకా? అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలవాలనుకొంటే తాము అధికారంలోకి వస్తే ప్రజలకు, రాష్ట్రానికి ఏమి చేస్తుందో చెప్పుకోవాలి కానీ కెసిఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకోవడం సిగ్గు చేటు,” అని అన్నారు.