8.jpg)
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మళ్ళీ సిఎం కెసిఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్బులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ తెలంగాణా రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకొన్న అమరవీరులకు స్తూపం కట్టించడానికి ముందుకురాని సిఎం కెసిఆర్ ఆంధ్రాకు చెందిన హరికృష్ణకు హైదరాబాద్‌లో స్మారకస్తూపం కట్టిస్తానని ప్రకటించడం చూస్తే ఆయన ఎంతగా దిగజారిపోయాదో అర్ధమవుతోంది. రాబోయే ఎన్నికలలో తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రాప్రజలను ఆకట్టుకొని వారి ఓట్లు దండుకోవడానికే సమైక్యవాది అయిన హరికృష్ణకు స్తూపం కట్టిస్తానని అంటున్నాడు. కానీ తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్నవారి కుటుంబాలను మాత్రం పట్టించుకోడు,” అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి వాదన ప్రకారం సిఎం కెసిఆర్‌తో సహా మంత్రులు, టిఆర్ఎస్ నేతలు అందరూ వచ్చి హరికృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించడం, ఆయన అంత్యక్రియలను టిఆర్ఎస్ సర్కారు అధికారిక లాంచనాలతో ఘనంగా నిర్వహించడం వంటివన్నీ ఆంధ్రా ప్రజలను ఆకట్టుకోవడానికేననుకోవలసి ఉంటుంది. ఆయన వాదనలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ హరికృష్ణ అంత్యక్రియల విషయంలో టిఆర్ఎస్ సర్కారు చాలా హుందాగా వ్యవహరించింది.