
హైదరాబాద్ పురానీ హవేలీలోని మస్రత్ మహల్లో గల నిజాం మ్యూజియంలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. కోట్లు విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్సు, బంగారు కప్పు సాసరు, చెంచాను దొంగిలించారు. బంగారు టిఫిన్ బాక్సు బరువు సుమారు రెండు కేజీలు ఉంటుందని మ్యూజియం నిర్వాహకులు తెలియజేశారు.
మ్యూజియంకు పగలు ముగ్గురు, రాత్రి ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది కాపలా కాస్తుంటారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దొంగలు మొదటి అంతస్తులోని ఒక కిటికీని పగులగొట్టి దాని గుండా మ్యూజియంలోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. మళ్ళీ అదే మార్గం ద్వారా తాడు సాయంతో క్రిందకు దిగి పారిపోయారు.
మ్యూజియం లోపలా, బయటా సిసి కెమెరాలు బిగించి ఉన్నప్పటికీ, ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది కాపలాకాస్తున్నప్పటికీ కెమెరాలకు చిక్కకుండా, సెక్యూరిటీ సిబ్బందికి తెలియకుండా దొంగతనం చేసి వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. దొంగతనానికి పాల్పడినవారు ముందుగా రెకీ నిర్వహించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. దొంగతనానికి గురైన వస్తువులు చాలా పురాతన కళాకండాల జాబితాలో ఉన్నవి కనుక వాటి విలువ కొన్ని కోట్లు ఉండవచ్చు.
1936లో చివరి నిజాం నవాబు మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహుదూర్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని జూబ్లీహాలులో జరిగాయి. ఆ సందర్భంగా ఆయన సామంతులు, నవాబులు ఆయనకు ఇటువంటి అమూల్యమైన బహుమతులు సమర్పించుకొన్నారు. ఆ తరువాత 2000 సం.లో నిజాం ప్యాలెస్ ను మ్యూజియంగా మార్చారు. నిజాం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ మ్యూజియంలోనే ఆ విలువైన వస్తువులన్నిటినీ భద్రపరిచారు. అవే ఇప్పుడు దొంగతనానికి గురయ్యాయి. పోలీసులు ఆ దొంగలను గుర్తించి పట్టుకోగలరా లేదా? విలువైన ఆ వస్తువులు రాష్ట్రం..దేశం దాటిపోక మునుపే వాటిని పట్టుకొని భద్రంగా తిరిగి తీసుకురాగలరా లేదా? చూడాలి.