అమ్మ బాటలోనే అందరూ...

దేశంలో మొట్టమొదటిసారిగా తమిళనాడు రాష్ట్రంలో జయలలిత హయంలో ‘అమ్మా క్యాంటీన్స్’ ఏర్పాటుచేయబడ్డాయి. నిరుపేద ప్రజలకు నామనాత్రపు ధరకే నాణ్యమైన ఫలహారం, భోజనం అందించడమే లక్ష్యంగా అవి ఏర్పాటు చేయబడ్డాయి. వాటి నిర్వహణకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం వలన తమిళనాడులో నేటికీ అవి విజయవంతంగా నడుస్తున్నాయి. ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమ్మ బాటలోనే నడుస్తూ సబ్సీడీ క్యాంటీన్లు ఏర్పాటు చేశాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘యోగీ థాలీ’ పేరుతో రూ.10లకే భోజనం అందించే పధకం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ఆదివారం ప్రారంభించారు. అయితే దిలీప్ అనే ఒక దాత ఈ పధకానికి అవసరమైన నిధులు అందజేస్తున్నారని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదనే ఆలోచనతోనే ఈ పధకం ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. 

ఇటువంటి పధకాలు ప్రకటించడం ఎంత సులువో వాటిని విజయవంతంగా నిర్వహించడం అంత కష్టమని అందరికీ తెలుసు. నిరుపేద ప్రజల ఆకలి తీర్చాలనుకోవడం చాలా మంచి, గొప్ప ఆలోచనే. కానీ స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు గడిచినా నేటికీ దేశంలో కోట్లాది ప్రజలు ఆకలితో ఎందుకు అలమటిస్తున్నారు? వారి ఆ పరిస్థితికి ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించుకొంటే పాలకులు వారి అసమర్ధత వైఫల్యలే కారణమని చెప్పక తప్పదు. నానాటికీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాది మార్గాలను సృష్టించడంలో విఫలం అవుతునందునే నేటికీ ఇటువంటి ప్రజాకర్షక పధకాలు ప్రకటించవలసి వస్తోందని చెప్పవచ్చు.