ప్రగతి నివేదనకు రూ.300 కోట్లు ఖర్చు?

ఆదివారం సాయంత్రం కొంగరకలాన్ వద్ద సిఎం కెసిఆర్‌ నిర్వహించిన ప్రగతి నివేదన సభపై టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, “టిఆర్ఎస్‌ సర్కారు ఆ సభకు రూ.300 కోట్లు ఖర్చుచేసినా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సభతో సిఎం కెసిఆర్‌ తన ధనబలాన్ని తద్వారా తన ప్రభుత్వ అవినీతిని లోకానికి ప్రదర్శించుకొన్నారు. అంతా అట్టహాసంగా సభ నిర్వహించినా చివరికి తన ప్రసంగంతో తుస్సుమనిపించారు. సిఎం కెసిఆర్‌ తన ప్రసంగంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, దళితలకు 3 ఎకరాల భూపంపిణీ, ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల గురించి ప్రస్తావించకపోవడం గమనిస్తే ఆ హామీల అమలులో ఆయనకు నిబద్దత లేదని అర్ధమవుతోంది. మిషన్ భగీరధతో ఇప్పటివరకు కనీసం 10 శాతం ఇళ్లకు కూడా నీళ్ళు ఇవ్వలేదు కానీ ఆ పధకం విజయవంతంగా పూర్తిచేశామని నిన్న గొప్పలు చెప్పుకొన్నారు. అది కమీషన్ల కోసమే ప్రారంభించిన పధకం కనుక దానిని కమీషన్ భగీరధ అని అనడం సమాజసం. ఇక తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం అరికట్టామని గొప్పలు చెప్పుకొన్న సిఎం కెసిఆర్‌ తను ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్క విద్యుత్ ప్రాజెక్టు అయినా కట్టారా? పూర్తిచేశారా?ఈ నాలుగేళ్లలో టిఆర్ఎస్‌ సర్కారు ఏమీ చేయకపోయినా చాలా చేసేసినట్లు గొప్పలు చెప్పుకొన్నారు. టిఆర్ఎస్‌ మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆర్టీసీ బస్సులను వాడుకొన్నారు. విద్యార్ధులకు ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ చెల్లించకపోయినా బలవంతంగా ప్రైవేట్ స్కూలు బస్సులను కూడా వాడుకొన్నారు” అని విమర్శించారు. 

అయితే ఈ సభకు తమ ప్రభుత్వం ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని, సిఎం కెసిఆర్‌ అద్భుతమైన పాలన చూసి ఆయనపై అభిమానంతోనే లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా ట్రాక్టర్లలో తరలివచ్చారని, సభకు జరిగిన ఖర్చు మొత్తం టిఆర్ఎస్‌ పార్టీయే భరించిందని, ప్రభుత్వ ఖజానాలో నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని టిఆర్ఎస్‌ నేత గోవర్ధన్ చెప్పారు. ప్రగతి నివేదన సభకు రూ.300 కోట్లు ఖర్చు చేశామని కాంగ్రెస్‌ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.