
టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికల గంట కొట్టడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ హడావుడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు జరపాలంటే ఈనెల 10వ తేదీలోగా శాసనసభను రద్దు చేయవలసి ఉంటుంది కనుక ప్రభుత్వానికి చాలా సమయం మిగిలి ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడంపై తుది నిర్ణయం తీసుకొనేందుకు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయవలసి ఉంది. కానీ రేపు ఆదివారం కొంగర కలాన్ లో 20-25 లక్షల మందితో ప్రగతి నివేదన సభ కూడా నిర్వహించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించడంతో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ప్రభుత్వాధికారులు, టీఆర్ఎస్ శ్రేణులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. అయితే టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభలో ప్రస్తావించవలసిన విషయాల గురించి ముందుగా చర్చించుకోవలసిన అవసరం ఉన్నందున రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు అత్యవసరంగా మంత్రివర్గసమావేశం నిర్వహించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ సమావేశం పూర్తికాగానే అందరూ నేరుగా ప్రగతి నివేదన సభకు బయలుదేరతారు.
శాసనసభను రద్దు చేసి కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఆవిషయం తెలియజేసిన తరువాత టీఆర్ఎస్ అధికారహోదా కోల్పోతుంది. ఒకవేళ సిఎం కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఎన్నికల కోడ్ వెలువడితే ప్రభుత్వం కొత్తగా ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టలేదు కనుక రేపు జరుగబోయే ప్రగతి నివేదన సభలోనే వాటిని అన్నిటినీ ప్రకటించవలసి ఉంటుంది. రేపు జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో వాటి గురించే లోతుగా చర్చించే అవకాశం ఉంది కనుక ఆ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.