తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీలకు పేర్లు ఖరారు?

ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్‌ గంటలు మ్రోగిస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీ కూడా చురుకుగా అందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌ కమిటీల జాబితాలు సమర్పించారు. రాహుల్ గాంధీ వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు చేసి త్వరలోనే వాటికి ఆమోదముద్ర వేయవచ్చు. 

ప్రచార కమిటీ ఇన్-ఛార్జ్ గా రేవంత్ రెడ్డి లేదా భట్టి విక్రమార్క పేర్లను సిఫార్సు చేసినట్లు సమాచారం. అలాగే మ్యానిఫెస్టో, సమన్వయ, ప్రణాళిక, వ్యూహరచన కమిటీలకు ఛైర్మన్ మరియు సభ్యుల పేర్లను రాహుల్ గాంధీకి అందజేశారు. ఆ జాబితాలో సీనియర్ కాంగ్రెస్‌ నేతలు వి.హన్మంతరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, బలరాం నాయక్, డికె.అరుణ, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, కెఆర్ సురేశ్ రెడ్డి తదితరుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

ముందస్తు ఎన్నికల కోసమే కాంగ్రెస్‌ కమిటీలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ, కమిటీల ఛైర్మన్ మరియు సభ్యుల పదవుల కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలలో కీచులాటలు, అలకలతో కాంగ్రెస్‌ పార్టీలో ముందస్తు హడావుడి మొదలైపోవచ్చు. ఆ తరువాత కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితాను సిద్దం చేస్తే కాంగ్రెస్‌ పార్టీలో పూర్తిస్థాయిలో ఎన్నికల హడావుడి మొదలైపోయినట్లే.