తెలంగాణ న్యాయాధికారులకు న్యాయం జరుగుతుందా?

రాష్ట్ర విభజన జరిగి 51 నెలలు గడిచినా ఇంతవరకు హైకోర్టు విభజన ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీకి చెందిన అనేకమంది న్యాయమూర్తులు, న్యాయవాదులు తెలంగాణలో ఉద్యోగాలు చేపట్టారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయాధికారుల పదవుల నియామకాలు జరుపాలని పేర్కొంది. కానీ ఆవిధంగా చేయడం వలన న్యాయశాఖలో ఎక్కువ సంఖ్యలో ఉన్న ఆంధ్రాకు చెందిన న్యాయాధికారులకే ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని తాము నష్టపోతున్నామని తెలంగాణ న్యాయాధికారుల వాదన. 

విభజన చట్టం ప్రకారమే నియామకాలు జరపాలని ఇదివరకు హైకోర్టు తీర్పు చెప్పడంతో తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరపున న్యాయవాదులు సల్మాన్ ఖుర్షీద్, అహ్మదీ సుప్రీంకోర్టులో 2015లో ఒక పిటిషను వేశారు. దీనిని గతంలో విచారించిన జస్టిస్ చలమేశ్వర్ అనివార్య కారణాల చేత ఈ విచారణ నుంచి తప్పుకొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏకె సిక్రీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ పిటిషనుపై గత మూడు రోజులపాటు ఇరుపక్షల వాదనలు విన్న తరువాత, తమ తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. కనుక ఈసారైనా సుప్రీంకోర్టు దీనిపై తెలంగాణ న్యాయాధికారులకు అనుకూలంగా తీర్పు చెపుతుందో లేక విభజన చట్టం ప్రకారమే నియామకాలు చేపట్టాలని ఆదేశిస్తుందో చూడాలి. ఈ సమస్యకు ఏకైక శాస్విత పరిష్కారం హైకోర్టు విభజన మాత్రమేనని చెప్పవచ్చు. కనుక రాష్ట్ర ప్రభుత్వం  దాని కోసం గట్టిగా ప్రయత్నిస్తే మంచిది లేకుంటే ఇటువంటి సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి.