.jpg)
హైదరాబాద్ హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న దుర్గం చెరువులోకి ఒకప్పుడు మురుగునీరు ప్రవహిస్తుండేది. దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా చెత్తచెదారంతో నిండిఉండేవి. ఆ కారణంగా అటువైపు నుంచి వెళ్ళేవారు ముక్కు మూసుకొని ముందుకు సాగవలసి వచ్చేది. కానీ టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే దుర్గం చెరువు పునరుద్దరణకు నడుం బిగించింది. రూ.12 కోట్లు వ్యయంతో దుర్గం చెరువు సుందరీకరణ పనులు చేపట్టింది.
ముందుగా దానిలోకి పారిశ్రామిక వ్యర్ధాలు, మురుగునీరు చేరకుండా అడ్డుకట్ట వేసింది. చెరువు పరిసరాలలో చెత్తచెదారం తొలగించి ఆ ప్రాంతంలో చక్కటి లాండ్ స్కేపింగ్ చేయించింది. అనేక మొక్కలు నాటారు. పాదచారులు నడిచేందుకు చక్కటి వాక్-వేస్ ఏర్పాటు చేయబడింది. అలాగే సైక్లింగ్ కోసం వేరేగా ట్రాక్స్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. దుర్గం చెరువు ప్రవేశ ద్వారాన్ని అందంగా మలిచిన తీరు అందరినీ ఆకట్టుకొంటోంది. పార్కు చుట్టుపక్కల రంగురంగుల విద్యుదీపాలు అమర్చడంతో ఇప్పుడు దుర్గం చెరువు సరికొత్త రూపంతో అందరినీ ఆకట్టుకొంటోంది.
దుర్గం చెరువు సుందరీకరణ మొదటిదశ పనులు పూర్తవడంతో రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ నిన్న దుర్గం చెరువు పార్కును నిన్న ప్రారంభించారు. దుర్గం చెరువుకు ‘మన దుర్గం చెరువు’ గా నామకరణం చేశారు. రెండవ దశ సుందరీకరణ పనులు కూడా త్వరలో పూర్తికానున్నాయి. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆ వివరాలు వేరేగా చెప్పుకొందాం.