నివేదన సభకు పోటీగా కాంగ్రెస్‌ ఆవేదన సభలు!

తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు మంగళవారం గాంధీ భవన్ లో సమావేశమయ్యి ముందస్తు ఎన్నికలకు చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు. సెప్టెంబర్ 2న టిఆర్ఎస్‌ ‘ప్రగతి నివేదన సభ’ నిర్వహించి తమ ప్రభుత్వం చేసిన, ఇంకా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి ఓట్లు అడగబోతోంది కనుక ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ‘ప్రజా ఆవేదన సభ’ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించి టిఆర్ఎస్‌ సర్కార్ వైఫల్యాలను అవినీతిని ఎండగట్టాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు.

ముందస్తు ఎన్నికలు వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కనుక త్వరలోనే అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, మ్యానిఫెస్టో తదితర కమిటీలను ఏర్పాటు చేసుకొని సన్నాహాలు మొదలుపెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు భావ సారూప్యత కలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని, ఇతర పార్టీలలో నుంచి వచ్చే వారిని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇతర పార్టీలతో పొత్తులు, బస్సు యాత్ర గురించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం 70 సీట్లు గెలుచుకోవడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.