
హైదరాబాద్ నగరంలో 11 ఏళ్ళ క్రితం గోకుల్ చాట్, లుంబినీ పార్కులలో జరిగిన జంట ప్రేలుళ్ల కేసుపై విచారణ జరుపుతున్న నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణ ఈ నెల 7వ తేదీనే పూర్తయింది కనుక ఈరోజు తుది తీర్పు వెలువడుతుందని అందరూ భావించారు. కానీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరావు చివరి నిమిషంలో ఈ కేసును వచ్చే నెల 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న 8మందిలో అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ అనే ముగ్గురు ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు: అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్‌లు చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఈ ప్రేలుళ్ళకు పాల్పడినవారందరూ ఇండియన్ ముజాహుద్దీన్ అనే ఉగ్రవాద సంస్థకు చెందినవారే. భద్రతా కారణాల రీత్యా వారిని జైలులోంచే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 2007, ఆగస్ట్ 25న జరిగిన జరిగిన ఈ జంట ప్రేలుళ్ళలో మొత్తం 42 మంది చనిపోగా మరో 50 మంది తీవ్రగాయాలపాలయ్యారు. అప్పటి నుంచి ఈ కేసుపై దర్యాప్తు, కోర్టు విచారణ కొనసాగుతూనే ఉంది. నేడు తుది తీర్పు వెలువడుతుందనుకొంటే మళ్ళీ వచ్చే నెలకు వాయిదా పడింది.