మిషన్ కాకతీయకు 5వేల కోట్ల సహాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మిషన్ కాకతీయ కోసం కేంద్రం సహాయాన్ని కోరుతోంది. చెరువులకు పూర్వ వైభవాన్ని సంపాదించి, తద్వారా సాగునీటి సమస్యలను అధిగమించాలని తెలంగాణ సర్కార్ ముందు చూపుతో ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమానికి రూ.5 వేల కోట్ల సాయాన్ని అందించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఆయన లేఖ రాశారు. వచ్చే మూడేండ్ల కోసం ఈ సాయాన్ని అందించాలని కోరారు. ఇందుకు అనుగుణంగా నీటి ఆయోగ్‌ చేసిన సిఫారసులను ఆయన గుర్తుచేశారు. 

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా తెలంగాణలోని వెనుక బడిన జిల్లాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకోసం...'ప్రత్యేక ప్యాకేజీని' అందించాలంటూ సూచించిందని తెలిపారు. ఆ చట్టం ప్రకారమే...మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ కార్యక్రమాలకు రూ.30,571 కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. కేంద్ర జలవనరులశాఖ ద్వారా దేశవ్యాప్తంగా జల సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సీఎం తెలిపారు. ఇదే లక్ష్యంతో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమ పురోగతిని, చేపట్టిన కార్యక్రమాలను సీఎం తన లేఖలో ప్రస్తావించారు.