ఆ డబ్బాలలో ఏముందంటే...

టిఆర్ఎస్‌ దాని అధినేత కెసిఆర్‌పై ఎప్పటికప్పుడు తాజా ఆరోపణలు చేసే కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి ఈరోజు మరో సరికొత్త ఆరోపణ చేశారు. 

శుక్రవారం తెలంగాణా భవన్ లో జరిగిన టిఆర్ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలందరికీ పార్టీ తరపున ప్రచారసామాగ్రి ఉన్న డబ్బాలను అందజేశారు. సెప్టెంబర్ 2న జరుగబోయే ప్రగతి నివేధన సభ కోసం వాటిని అందజేసినట్లు టిఆర్ఎస్‌ నేతలు చెప్పారు.  

దీనిపై కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “ప్రగతి నివేధన సభ కోసం టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలందరికీ చిన్న చిన్న డబ్బాలలో ప్రచారసామాగ్రి పెట్టి అందజేశామని చెపితే నమ్మశక్యంగా ఉందా? రూ.2-3,000 లు విలువగల పార్టీ జెండాలు, బ్యానర్లు పెడితే ఆ డబ్బాలు నిండిపోతాయి. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలందరూ ఐశ్వర్యవంతులే. వారు ఆ డబ్బాల కోసం అంతగా ఎగబడటం, ఆ డబ్బాలన్నీ సీలు చేసి ఉండటం, వాటికి పటిష్టమైన గన్ మ్యాన్ రక్షణతో తీసుకువెళ్ళడం గమనిస్తే ఆ డబ్బాలలో చాలా విలువైనదే ఉందని అర్ధమవుతోంది. నాకు అందిన సమాచారం ప్రకారం ఒక్కో డబ్బాలో కోటి రూపాయలు పెట్టి టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు అందజేశారు. కానీ పైకి మాత్రం ఆ డబ్బాలలో పార్టీ ప్రచారసామాగ్రి ఉందని చెపుతున్నారు. ఆ డబ్బాలలో కేవలం ప్రచార సామాగ్రి మాత్రమే ఉన్నట్లయితే వాటికి గన్ మ్యాన్లతో పహారా ఎందుకు?ఒక్కో ఎమ్మెల్యేకి కోటి రూపాయలు చొప్పున పంచడానికి కెసిఆర్‌కు అంతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?” అని ప్రశ్నించారు. 

సీనియర్ కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ కూడా సిఎం కెసిఆర్‌పై అవే ఆరోపణలు చేశారు.  ఆ డబ్బాలలో డబ్బు ఉంది కనుకనే అంతా పటిష్టమైన భద్రత కల్పించారని అనుమానం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి అంతా మేలే చేస్తే ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారు? ప్రగతి నివేధన సభ పెట్టి తమ ప్రభుత్వం గురించి బాకా ఊదుకోవలసిన అవసరం ఏమిటి? అని ప్రశ్నించారు.