బ్యాంకు వినియోగదారులూ ఒక్క క్షణం, ఈ నెల మీ లావాదేవీలు ఆలస్యం కావొచ్చు ప్రత్యేకించి చెక్కులు త్వరితగతిన క్లియర్ కాకపోవచ్చు, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌లలో జాప్యం తలెత్తొచ్చు కారణం ఈ నెలలో రకరకాలైన కారణాల వల్ల బ్యాంకులు మూత పడనుండడం. అయితే, ఏటీఎం నుంచి నగదు తీసుకోవడంలో మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎందుకంటే.. ఏటీఎం లలో డబ్బును పెట్టడానికి కొన్ని ప్రైవేటు సంస్థలకు పలు బ్యాంకులు బాధ్యతలను అప్పగించాయి.
ఇక సెలవుల వివరాల్లోకి వెళ్తే 6వ తేదీ రంజాన్, 12వ తేదీ బ్యాంకు సిబ్బంది సమ్మె. ఈ సమ్మె స్టేట్ బ్యాంకులన్నింటినీ ఎస్బీఐలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసనగా చేపడుతున్నారు. ఇక 13వ తేదీ బుధవారం కూడా సమ్మెనే, ఈ సారి ఆలిండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం, ఆలిండియా బ్యాంకు అధికారుల సంఘం అదే అంశంపై సమ్మెకు పిలుపునిచ్చింది. 29వ తేదీ శుక్రవారం కూడా బ్యాంకులకు మూతే ఈ సారి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇలా వెంట వెంటనే సెలవుండడం వల్ల బ్యాంక్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుందని, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.